Mamatha: ఏపీ సీఎస్ పునేఠా బదిలీపై మమతా బెనర్జీ స్పందన
- బీజేపీ చెప్పినట్టే ఈసీ నడుచుకుంటోంది
- మోదీ రాజ్యాంగ వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారు
- ఈసీ నిర్ణయాలపై మమతా అసంతృప్తి
ఏపీలో కీలక అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు ఎస్పీలు, ఇంటెలిజెన్స్ డీజీతో పాటు రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు చూసే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను కూడా బదిలీ చేయడంపై తీవ్రస్థాయిలో స్పందనలు వినిపించాయి. తాజాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఏపీ సీఎస్ బదిలీ వ్యవహారం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ అధినాయకత్వం చెప్పినట్టే కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని విమర్శించారు.
మోదీ రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని తనకు ఎదురుతిరిగిన సీఎంలపై ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, కర్ణాటక సీఎంల నివాసాలపై దాడులు చేయించి, ఇప్పుడు ఏపీలో చంద్రబాబుపైనా దాడులకు తెగించారని ఆరోపించారు. అటు, పశ్చిమ బెంగాల్ లో కూడా పలువురు ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేయడం పట్ల మమతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.