assailants: వ్యాపారి కణతకు తుపాకి గురిపెట్టి.. రూ.6.5 లక్షలు దోచుకున్న దుండగులు
- తన బైక్‌ను ఎందుకు ఢీకొట్టారంటూ వ్యాపారితో గొడవ
- కారు అద్దం దించమని తుపాకి గురి
- డబ్బు సంచితో మాయమైన దుండగులు
ఓ వ్యాపారిని తుపాకితో బెదిరించి రూ.6.5 లక్షలు దోచుకున్న ఘటన ఢిల్లీలో జరిగింది. నగరంలోని సర్దార్ బజార్లో ఆటోఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న బాధితుడు పర్విందర్ నరూల రాత్రి 7:45 గంటలకు కారులో ఇంటికి వస్తున్న వేళ అజాద్ మార్కెట్ అండర్‌పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. తన ఉద్యోగితో కలిసి రూ.6.5 లక్షల బ్యాగును తీసుకొస్తుండగా ఆజాద్ మార్కెట్ అండర్‌పాస్ వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారి కారును ఆపారు.
తమ బైక్‌ను ఎందుకు ఢీకొట్టారంటూ పర్విందర్తో గొడవపడ్డారు. బైక్‌ను ఢీకొట్టలేదని పర్విందర్ చెబుతున్నా వారు వినిపించుకోలేదు. మాట్లాడేందుకు కారు అద్దం దించాలంటూ నిందితులు పర్విందర్ను కోరారు. అతడు అద్దం దించిన వెంటనే పలుమార్లు తుపాకితో కాల్పులు జరిపారు. అనంతరం అతడి కణతకు గురిపెట్టి డబ్బులున్న సంచిని దోచుకుని పరారయ్యారు.
పర్విందర్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దుండగుల తుపాకి నుంచి వెలువడ్డ ఓ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. పర్విందర్కు బాగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.