Devineni Avinash: తండ్రి వయసున్న చంద్రబాబుపై కొడాలి నాని మాట్లాడే పద్ధతిని ప్రజలు గమనిస్తున్నారు: దేవినేని అవినాశ్

  • ఏడాదికోసారి వచ్చేవాడు లోకలా?
  • చచ్చేవరకు గుడివాడలోనే ఉంటా!
  • గుడివాడలో ఇప్పటికీ ఎన్టీఆర్ హవా ఉంది

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న కృష్ణా జిల్లా గుడివాడ నియోజవకర్గం చాలాకాలం పాటు టీడీపీకి కంచుకోటలా ఉంది. అయితే, ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొడాలి నాని విజయం సాధించారు. ఇప్పుడాయనపై దేవినేని అవినాశ్ పోటీచేస్తున్నారు. కొంతకాలంగా నాని మాటతీరుతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న టీడీపీ ముఖ్యనేతలు ఈసారి అతడి ఓటమే లక్ష్యంగా యువకుడైన అవినాశ్ ను బరిలో దింపారు. ఈ నేపథ్యంలో గుడివాడలో తన అవకాశాలపై అవినాశ్ మీడియాతో మాట్లాడారు.

తాను పుట్టింది కృష్ణా జిల్లాలోనే అని, చంద్రబాబు ఆదేశాలతో గుడివాడ నుంచి పోటీచేస్తున్నానని వివరించారు. వ్యాపారాల కోసం నియోజకవర్గ ప్రజలను కూడా వదిలేసి హైదరాబాద్ వెళ్లి, ఎప్పుడో ఏడాదికోసారి వచ్చే వ్యక్తి లోకల్ ఎలా అవుతాడంటూ నానిపై విమర్శలు చేశారు. చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో గుడివాడలోనే ఇల్లు కొనుక్కున్నానని, చనిపోయేవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు తన దృష్టంతా గెలుపుపైనే ఉందని స్పష్టం చేశారు.

తండ్రి వయసున్న చంద్రబాబులాంటి వ్యక్తిపై కొడాలి నాని మాట్లాడే పద్ధతిని అందరూ గమనిస్తున్నారని అవినాశ్ తెలిపారు. నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీ నుంచి సస్పెండైన నాని ప్రజల సమస్యలను ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో నాని గెలిచింది కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇప్పటికీ గుడివాడలో ఎన్టీరామారావు హవా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News