Vijay Sai Reddy: విజయసాయిరెడ్డీ... నేను మగాడినని తొడగొట్టి చెబుతున్నా: సినీ నటుడు శివాజీ
- ఎప్పుడైనా జైలుకు వెళతామనే భయంతో బతుకుతున్నారు
- వైసీపీ గెలిచినా అమరావతి గడ్డపై నిలబడి మాట్లాడతా
- పవన్ కల్యాణ్ ను కూడా విమర్శిస్తారా?
తెలుగులో ఉన్న వెబ్ సైట్లలో 80 శాతం వైసీపీ అధినేత జగన్ పెట్టించినవేనని... వెబ్ సైట్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడమేంటని సినీనటుడు శివాజీ మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తున్న తనకు కులాన్ని అంటగడుగున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చేస్తున్న పోరాటం తనకు ఎంతో తృప్తిని ఇస్తోందని... కోట్లాది రూపాయలు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వలేవని చెప్పారు.
విజయసాయిరెడ్డి తనను విమర్శిస్తున్నారని... తిరిగి తాను విమర్శిస్తే తలను ఆయన ఎక్కడ పెట్టుకుంటారని శివాజీ ప్రశ్నించారు. ఆయన బాసేమో ఏ1, ఆయన ఏ2... మమ్మల్ని విమర్శించే స్థాయా మీది? అని దుయ్యబట్టారు. ఏదో ఒక క్షణంలో జైలుకు వెళతామనే భయంతో బతుకుతున్న మీరా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు మాట్లాడినా... వారిని కోస్తాం, చంపుతాం అని బెదిరిస్తున్నారని... ఇంకో 20 రోజులు ఆగండి... మీ సంగతి చూస్తామంటూ పోలీసులను సైతం భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
డబ్బు మదంతో ఏది పడితే అది మాట్లాడతారా? అని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందేనని... గాంధీ, నెహ్రూ, ఎన్టీఆర్, చివరకు రాజశేఖరరెడ్డి కూడా పోయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే... ఛార్జిషీట్లలో పేర్కొన్న డబ్బును ప్రజలకు ఇచ్చి, ధైర్యంగా అందరి ముందుకు రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు.
మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను 'ఉల్లిపాయ పొట్టు' అంటూ విమర్శించారని.. అంత అహంకారం ఎందుకంటూ విజయసాయిపై శివాజీ మండిపడ్డారు. అధికారంలోకి రాకముందే ఇంత కండకావరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ చంపుతాం, నరుకుతామంటూ బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మగాడినని... ఎన్నికల్లో వైసీపీ గెలిచినా, అమరావతి గడ్డపై నిలబడి మాట్లాడతానని సవాల్ విసిరారు. కాకిలా వందేళ్లు బతకాలనే కోరిక తనకు లేదని అన్నారు. ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరని... ముందు కేసుల నుంచి బయటపడి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.