Andhra Pradesh: ఒక్కసారి పులివెందులకు వెళ్లి చూడండి.. జగన్ ఇంటి ముందు నుంచి దళితులు వెళ్లాలంటే చెప్పులు విప్పి వెళ్లాలంట!: పవన్ కల్యాణ్
- చంద్రబాబు, వైఎస్ కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాయి
- జనసేన మాత్రమే ఎవరి అండా లేకుండా రాజకీయాల్లోకి వచ్చింది
- అమలాపురం బహిరంగ సభలో మాట్లాడిన జనసేనాని
చంద్రబాబు, వైఎస్ కుటుంబాలు రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. చంద్రబాబు మామను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయితే, జగన్ తండ్రి వారసత్వంతో రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. ఒక్క జనసేన పార్టీ మాత్రమే ఎవరి అండ లేకుండా ప్రజల ముందుకు వచ్చిందని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడారు.
తాను కాపులకే ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ నేతలు విమర్శించారనీ, అది నిజం కాదని పవన్ అన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు తనకు సమానమేనని స్పష్టం చేశారు. ‘తనకు దళితుల మీద ప్రేమ ఉందని జగన్ చెబుతారు. వెనుకబడిన కులాల గురించి మాట్లాడతారు. కానీ ఒక్కసారి పులివెందుల వెళ్లి చూడండి. దళితులను ఎంతగా ఇబ్బంది పెడతారో. వాళ్ల ఇంటి ముందు దళితులు చెప్పులు విప్పి వెళ్లాలంట. ఆయనేమో ఇక్కడికొచ్చి దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. కులాలను అడ్డుపెట్టుకుని తాను రాజకీయం చేయనని జనసేనాని స్పష్టం చేశారు.