Babumohan: కేసీఆర్ 17 ఎంపీ సీట్లతో దేశాన్ని శాసిస్తే మిగతా పార్టీలు ఏం చేయాలి?: బాబుమోహన్ సెటైర్
- కేసీఆర్ ఢిల్లీలో మోదీ కాళ్లు మొక్కింది నిజంకాదా?
- అప్పుడు మోదీ మంచివాడా? ఇప్పుడు చెడ్డవాడు అయ్యాడా?
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు
ఇటీవలే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన బాబుమోహన్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ తాను 17 సీట్లతో దేశాన్ని శాసిస్తానని అంటున్నారని, ఆయన కేవలం 17 సీట్లతోనే హవా సాగిస్తే దేశంలో మిగిలిన జాతీయ పార్టీలు ఏంచేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని, కేసీఆర్ చెబుతున్నదాంట్లో ఒక్కటీ వాస్తవంలేదని మండిపడ్డారు.
సర్జికల్ స్ట్రయిక్స్ లో ఎవరూ మృతి చెందలేదని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఒకప్పుడు ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు మొక్కిన కేసీఆర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మంచివాడైన మోదీ ఇప్పుడు చెడ్డవాడు ఎలా అయ్యారని ప్రశ్నించారు.
కేంద్రం లక్షల కోట్ల నిధులు పంపిస్తే కేసీఆర్ లెక్క చెప్పకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కొన్నిరోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పును అందరూ గమనించాలని, రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ శాసనసభ్యులే ఉంటే అభివృద్ధి ఎందుకు జరగడంలేదని బాబుమోహన్ నిలదీశారు.