Gautam Gambhir: ఇన్నేళ్లు నిన్ను బెంగళూరు కెప్టెన్ గా భరించారంటే చాలా గొప్ప విషయం కోహ్లీ!: గంభీర్ వ్యంగ్యం
- కెప్టెన్సీలో కోహ్లీ ఎప్పటికీ సహాయకుడే!
- ఒక్క ట్రోఫీ కూడా గెలిపించలేకపోయావు
- బౌలర్లపై నిందలు వేయకు
తనకు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న విభేదాలు నిజమేనని నిరూపిస్తూ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శలతో రెచ్చిపోయాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచ్ లలో ఓటమిపాలవడంతో గంభీర్ కు అదను దొరికింది. ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలిపించకపోయినా ఇన్నేళ్లపాటు బెంగళూరు జట్టుకు నిన్ను కెప్టెన్ గా కొనసాగించడం చాలా గొప్ప విషయం కోహ్లీ అంటూ ఎద్దేవా చేశాడు. కోహ్లీ మంచి బ్యాట్స్ మన్ మాత్రమేనని, కెప్టెన్సీ విషయంలో ఓ సహాయకుడు మాత్రమేనని అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై కోహ్లీ స్పందిస్తూ, అందరిలా ఆలోచిస్తే ఇంట్లోనే కూర్చుంటాం అంటూ బదులిచ్చాడు. దాంతో, గంభీర్ మరోసారి స్పందిస్తూ, జట్టు ఓడిపోతుంటే బౌలర్లపై నిందలు వేయొద్దు అంటూ చురకలంటించాడు. భారత జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఉండి కూడా ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని వ్యక్తి కోహ్లీ మాత్రమేనని విమర్శించాడు. కోహ్లీ కంటే రోహిత్ శర్మ నయం అని, వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ముంబయిని రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిపాడని గుర్తుచేశాడు.