jana sena party: పవన్ కు ఎందుకు ఓటెయ్యాలి? మాయావతి కాళ్లు పట్టుకున్నందుకా?: కేఏ పాల్
- నాడు యాభై శాతం కాపులు చిరంజీవిని వదిలేశారు
- ఇప్పుడు మిగిలిన యాభై శాతం పవన్ కు దూరం
- కాపులందరూ ‘ఛీ’ అనేశారు
నటులు పవన్ కల్యాణ్, నాగబాబుకు ఓట్లు వేయడం కన్నా తెలివితక్కువ తనం మరోటి ఉండదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు, ‘నటన’ అంటేనే నిజం కానిది అని అర్థమని చెప్పారు. ‘నేను ప్రపంచ హీరోను. ఏడు యుద్ధాలు ఆపాను. నిజం చెప్పాలంటే, నేను నేచురల్ డ్యాన్స్ వాళ్ల కంటే బాగా వేయగలను. రమ్మనమనండి, డ్యాన్స్, రన్నింగ్, డిబేట్ కాంపిటీషన్ కు’ అని ఛాలెంజ్ విసిరారు.డబ్బు తీసుకురావడానికి, సంపాదించడానికి, ఏ పని అయినా చేయడానికి వాళ్లు తనతో పోటీపడగలరా? అసలు, వాళ్లు ఏం చేయగలరు? అని పవన్, నాగబాబులను ప్రశ్నించారు.
జనసేనకు, పవన్ కు ఎందుకు ఓటెయ్యాలి? మాయావతి పాదాలు పట్టుకున్నందుకా? అని ప్రశ్నించారు. కాపులందరూ ‘ఛీ’ అనేశారని, నాడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు యాభై శాతం కాపులు వారికి దూరమయ్యారని, ఇప్పుడు, మిగిలిన యాభై శాతం కాపులు పవన్ ని వదిలేశారని అభిప్రాయపడ్డారు. తాను అన్ని కులాలు, మతాలను కలుపుకుని ఆంధ్రాను అమెరికాను చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. నటులకు, దొంగలకు, దోచుకునే వారికి ఓట్లు వేయొద్దని ప్రజలకు కేఏ పాల్ సూచించారు.