Chandrababu: భద్రాచలం మాదే.. మా రాముడిని మేం కాపాడుకుంటాం: చంద్రబాబు
- పొగ పెట్టాను.. ఎలుక బయటకు వచ్చింది
- భద్రాచలాన్ని మాకిస్తే భద్రంగా చూసుకుంటాం
- కేసీఆర్ వేసే బిస్కెట్లకు జగన్ తోక ఊపుతున్నారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్టణంలలో మాట్లాడిన చంద్రబాబు ఖమ్మం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డంకి కాదన్న కేసీఆర్.. ప్రాజెక్టు కారణంగా భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. భద్రాచలాన్ని, రాముడిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఒకప్పుడు భద్రాచలం ఏపీలోనే ఉండేదని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.
భద్రాచలాన్ని తమకిస్తే భద్రంగా చూసుకుంటామన్నారు. సాగర్, శ్రీశైలంలను నియంత్రణలో ఉంచుకున్న మీకు పోలవరంలో వాటా కావాలా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెత్తందారీ పాలన తమ వద్ద సాగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేసీఆర్, జగన్లు ముసుగు తీసేశారని అన్నారు. కేసీఆర్ వేసే బిస్కెట్లకు జగన్ తోక ఊపుతున్నారని అన్నారు. జగన్ తమ మిత్రుడే అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు మాట్లాడుతూ.. పొగ పెట్టానని, కలుగులోంచి ఎలుక బయటకు వచ్చిందని అన్నారు.