BB Patil: టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగవేశారు: షబ్బీర్ అలీ ధ్వజం
- 3 కేసులు నమోదైనా తెలియనివ్వట్లేదు
- గజమాలతో ఎందుకు సన్మానించారు?
- నిధులను తిరిగి పంపించినందుకా?
- క్రిమినల్ కేసులు ఉన్నందుకా?
ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగవేసిన వ్యక్తి టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అని షబ్బీర్ అలీ ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాటిల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాటిల్‌పై మూడు కేసులు నమోదైనా ప్రజలకు తెలియనివ్వడం లేదన్నారు. అలాంటి క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి ఎంపీ అయితే మెంబర్ షిప్ పోవడంతో పాటు జైలుకు పోవడం ఖాయమన్నారు. దొంగలను కాకుండా, స్థానిక నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిన్న బీబీ పాటిల్ కామారెడ్డికి వస్తే క్రేన్ ద్వారా గజమాలతో సన్మానించారని, అసలా గజమాలను ఎందుకు వేశారో చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మొట్ట మొదటి సారి కామారెడ్డి వచ్చినందుకు గజమాల వేశారా? కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖర్చు పెట్టకుండా తిరిగి పంపించినందుకా? లేదంటే క్రిమినల్ కేసులు ఉన్నందుకు వేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నెల రోజుల క్రితం పాటిల్ ను ఎంపీగా వద్దన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ ఏం చేశారో ఏమో కానీ, 15 రోజుల్లో మారిపోయి శభాష్ పాటిల్ అంటున్నారని, దీనిలోని ఆంతర్యమేంటో అర్థం కావట్లేదన్నారు.