Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో 2014లో ఆడిన గేమే ఆడారు: ప్రొఫెసర్ నాగేశ్వర్
- హోదా, విభజన హామీల గురించి తక్కువగా మాట్లాడారు
- ప్రధానంగా ఒకరినొకరు తిట్టుకునేలా ప్రసంగాలు చేశారు
- అవహేళనగా మాట్లాడుకున్నారు
ఏపీ ఎన్నికల ప్రచారంలో అవసరమైన, అవసరం లేని అంశాల గురించి ఆయా పార్టీల నేతలు మాట్లాడారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎక్కువగా సెంటిమెంట్ అంశాలను ఆధారంగా చేసుకుని నేతల ప్రచారం సాగిందని అన్నారు. ప్రజల హక్కులు, సమస్యల కన్నా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే సెంటిమెంట్ ఎలా వాడాలన్న అంశం ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన అజెండాగా చేసుకుని ఎన్నికల ప్రచారం సాగుతుందని అనుకున్నాను కానీ, అలా జరగలేదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అవసరం లేదని ఆయా పార్టీల నేతలు అనుకున్నారో ఏమో కానీ, 2014లో ఆడిన గేమే ఆడారని అన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి అప్పుడప్పుడు ఆయా నేతలు ప్రస్తావించినప్పటికీ, ప్రధానంగా ఒకరినొకరు తిట్టుకోవడం, వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం, అవహేళన చేసుకోవడం, దుర్భాషలాడటం చేస్తూ, ఒకరినొకరు కనీసం గౌరవించుకోకుండా ప్రసంగాలు చేశారని విశ్లేషించారు.