Tirumala: భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల!
- రేపు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
- సాధారణ దర్శనానికి 4 గంటల సమయం
- రూ. 2.65 కోట్లకు తగ్గిన హుండీ ఆదాయం
నిత్యమూ భక్తులతో కిటకిటలాడే తిరుమలగిరులు బోసిపోయాయి. ఏపీలో ఇటు అసెంబ్లీకి, అటు లోక్ సభకు రేపు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రాక మందగించింది. స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం, టోకెన్ స్లాట్ పొందిన భక్తుల దర్శనానికి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది.
కాగా, నిన్న కూడా భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఇటీవలి కాలంలో నిత్యమూ 80 వేల మందికి పైగా స్వామిని దర్శించుకుంటుండగా, మంగళవారం నాడు 64,103 మంది స్వామిని దర్శించుకున్నారు. నిన్న 18,583 మంది తలనీలాలు సమర్పించారు. ఈ ప్రభావం హుండీపైనా పడింది. రూ. 2.65 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. రోజూ వచ్చే సగటు ఆదాయంతో పోలిస్తే, ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఈ వారాంతం నుంచి తిరిగి రద్దీ పెరుగుతుందని భావిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.