Veteran politician: సీనియర్ నేత, కేరళ కాంగ్రెస్ (ఎం) వ్యవస్థాపకుడు కేఎం మణి కన్నుమూత
- శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మణి
- ఆర్థిక మంత్రిగా అత్యధికసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత
- 50 ఏళ్లపాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా కొనసాగిన మణి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ రాజకీయ నేత, కేరళ కాంగ్రెస్ (ఎం) వ్యవస్థాపకుడు కేఎం మణి (86) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని లేక్షోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో మణి పార్టీ కీలక భాగస్వామిగా ఉంది.
అత్యంత సీనియర్ నాయకుడు అయిన మణి అత్యధికసార్లు రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేతగా రికార్డు సాధించారు. ఆర్థికమంత్రిగా మొత్తం 13 సార్లు అయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతేకాదు, యాభై ఏళ్లపాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా కొనసాగారు. నిజానికి ఈ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తారని భావించినా అనారోగ్య కారణాలతో ఆయన ప్రచారానికి కూడా దూరమయ్యారు.