Canada: అమెరికా వద్దంటున్నా కెనడా రమ్మంటోంది!
- భారతీయులకు ద్వారాలు తెరిచిన కెనడా
- సులభతర వీసాలు జారీ
- అమెరికాలో ఉన్నవాళ్లకు కూడా ఆహ్వానం
సుదీర్ఘకాలంగా భారతీయులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా ప్రముఖస్థానం వహిస్తోంది. చాలామంది అమెరికా వెళ్లలేని వాళ్లు కెనడాలో సెటిలవడం సాధారణ విషయమే. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతీయులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో కెనడా ద్వారాలు తెరిచి రారమ్మని ఆహ్వానిస్తోంది. గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (జీటీఎస్) పథకంలో భాగంగా తమ దేశంలో పనిచేయడానికి వచ్చే ప్రతిభావంతులైన యువతీయువకులకు సులభతర వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకుంది.
శాస్త్రసాంకేతిక రంగాలకు చెందినవాళ్లే కాకుండా, గణిత, ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్నవాళ్లకు ఇది సువర్ణావకాశం అని చెప్పాలి. అంతేకాదు, అమెరికాలో ఉన్న భారతీయులు కూడా నిరభ్యంతరంగా వచ్చేయొచ్చంటూ కెనడా వర్గాలు స్వాగతం పలుకుతున్నాయి. పైగా, ఈ ఉపాధి కల్పన శాశ్వత ప్రాతిపదికన అంటూ ఔత్సాహికులను ఊరిస్తోంది. అక్కడి ప్రముఖ సంస్థల సాయంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసి ఉద్యోగాలు అందించేందుకు కెనడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ జీటీఎస్ పథకంలో ఉద్యోగాలు పొందిన విదేశీయులకు కెనడాలో శాశ్వత పౌరసత్వం పొందడం మరింత సులువుకానుంది. కెనడా వచ్చే విదేశీయులు శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జీటీఎస్ పాయింట్లనే ప్రామాణికంగా తీసుకోనున్నారు.