Narendra Modi: మోదీ గెలిస్తే పాకిస్థాన్ లో టపాసులు కాలుస్తారు: కేజ్రీవాల్ వ్యాఖ్య
- మోదీకి ఓటేస్తే పాకిస్థాన్ కు ఓటేసినట్టే
- మోదీ గెలవాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆకాంక్ష
- మోదీకి, ఇమ్రాన్ కు మధ్య రహస్య చెలిమి ఉందన్న విపక్షాలు
ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. భారత్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ మోదీ సర్కారే రావాలంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇరుదేశాల మధ్య శాంతిచర్చలకు అవకాశాలు ఉంటాయన్నది ఇమ్రాన్ ఉద్దేశం. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే, బీజేపీ ఓ హిందుత్వ పార్టీ అయినా పాకిస్థాన్ ప్రధాని ఆ పార్టీయే గెలవాలని కోరుకుంటున్నారంటే మోదీ, ఇమ్రాన్ మధ్య రహస్య స్నేహం ఉందంటూ విపక్షాలు విమర్శల దాడి మొదలుపెట్టాయి.
మోదీకి ఓటేస్తే పాకిస్థాన్ కు ఓటేసినట్టేనని, ఇద్దరి మధ్య ఉన్న రహస్య బంధం ఇమ్రాన్ ప్రకటన నేపథ్యంలో బట్టబయలైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. మోదీకి గతంలో నవాజ్ షరీఫ్ మిత్రుడని, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా మిత్రుడయ్యాడని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మోదీ గెలిస్తే పాకిస్థాన్ లో టపాసులు కాల్చుతారని వ్యాఖ్యానించారు. అసలు, మోదీ గెలవాలని పాక్ కోరుకోవడం వెనకున్న అంతర్యం ఏమిటి? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.