cudupha: కడప జిల్లా పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
- సీఎం రమేష్, వైసీపీ ఏజెంట్ల మధ్య మాటల యుద్ధం
- ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించిన రమేష్
- తమపై చేయిచేసుకున్నారంటూ బైఠాయించిన ఏజెంట్లు
పోలింగ్ సందర్భంగా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, అక్కడి వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం ఇందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే...పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్లు కూర్చుని ఉన్న సమయంలో ఆ కేంద్రానికి వెళ్లిన రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
వారు బయట ఉండి ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే సమయంలో రమేష్‌ను సుధాకర్ అనే ఏజెంటు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. తనపై రమేష్ చేయిచేసుకున్నాడంటూ సుధాకర్ ఆరోపించడంతో ఏజెంట్లంతా ఆందోళనకు దిగారు. కేంద్రం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.