poling: ఓటర్లలో చైతన్యం కనిపిస్తోంది... పోలింగ్ శాతం పెరుగుతుంది: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది
- ఉదయానికే భారీగా క్యూలు కనిపించాయి
- ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది
- ఎటువంటి పుకార్లు నమ్మవద్దు
ఓటర్లలో చైతన్యం కనిపిస్తోందని, పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లను చూస్తే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమై కొనసాగుతోందని తెలిపారు.
ఓటర్లు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని, చిన్నచిన్న సాంకేతిక సమస్యలు తప్ప అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ఈవీఎంలకు సక్రమంగా కేబుల్ కనెక్షన్లు ఇవ్వక పోవడంతో కొన్నిచోట్ల పనిచేయలేదని, సాంకేతిక సిబ్బంది తక్షణం స్పందించి వాటిని సరిచేశారని తెలిపారు. కొన్ని చోట్ల సాంకేతిక సిబ్బంది చేరుకునే సరికే అక్కడి సిబ్బందే సమస్య పరిష్కరించారన్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల పోలింగ్ కాస్త ఆలస్యమైనా సకాలంలో కేంద్రానికి వచ్చిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తారన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.