Andhra Pradesh: ప్రజలారా.. ఇళ్ల నుంచి బయటకు రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి!: నారా లోకేశ్ పిలుపు
- ఏపీలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
- ఉదయాన్నే మొరాయించిన ఈవీఎంలు
- ఓపిక నశించి ఇళ్లకు వెళ్లిపోయిన ప్రజలు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ ఈరోజు పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాయలసీమతో పాటు గుంటూరు, ఏలూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీనికితోడు ఉదయాన్నే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో చాలామంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఈనేపథ్యంలో ప్రజలకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘ మీ ఉజ్వలమైన భవిష్యత్తుకు మీ ఓటే మార్గం. దయచేసి మీమీ ఇళ్ల నుంచి బయటకు రండి. ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే పునాది’ అని ట్వీట్ చేశారు. నారా లోకేశ్ ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.