Andhra Pradesh: ఐటీ మంత్రిగా చెబుతున్నా.. ప్రపంచంలోని ఏ టెక్నాలజీని అయినా హ్యాక్ చేయవచ్చు!: నారా లోకేశ్
- ఇందుకు ఈవీఎంలు మినహాయింపు కాదు
- బ్యాలెట్ పద్ధతి పెట్టాలని 2012 నుంచి పోరాడుతున్నాం
- టీడీపీ బలంగా ఉన్నచోట ప్రతిపక్షాల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల పోలింగ్ ఈరోజు ఆలస్యంగా ప్రారంభమయిందని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈవీఎం-వీవీప్యాట్ యంత్రాలను తొలిసారి వాడుతుండటం, అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువతతో పాటు వృద్ధులు ఉండటం కారణంగా పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మీరు ఈవీఎంలను సపోర్ట్ చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ..‘ఇదుగో..ఇప్పుడు నేను ఐటీ శాఖ మంత్రిగా పదేపదే చెప్పేది ఒక్కటే. ఏ టెక్నాలజీని అయినా హ్యాక్ చేయవచ్చు. ఇందుకు ఈవీఎంలు మినహాయింపు కాదు. సెల్ ఫోన్ కావచ్చు. స్మార్ట్ టీవీ కావొచ్చు. స్మార్ట్ కెమెరా అనండి. ఏదైనా హ్యాక్ చేయవచ్చు.
ప్రపంచంలోని ఏ దేశంలోనూ 100 శాతం అమలు చేయడం లేదు. టీడీపీ పోరాడింది కాబట్టే వీవీప్యాట్ యంత్రాలు వచ్చాయి. అదే పేపర్ బ్యాలెట్ ఉండిఉంటే ఎన్నికలు మరింత తొందరగా జరిగిపోయేవి. పేపర్ బ్యాలెట్ కోసం టీడీపీ 2012 నుంచి పోరాడుతోంది’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ బలంగా ఉన్నచోట్ల ప్రతిపక్ష నేతలు కావాలని ఆందోళనలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఓ ఈవీఎం రిపేర్ అయితే 15 నిమిషాల్లో మార్చడం పోయి ఇప్పుడు 3-4 గంటలు ఆలస్యం అవుతుందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా దయచేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.