Assange: ఎట్టకేలకు లండన్ లో 'వికీలీక్స్' అసాంజే అరెస్ట్
- అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు
- ఏడేళ్లుగా ఈక్వెడార్ ఎంబసీలో అసాంజే
- అసాంజే వైఖరితో విసిగిపోయిన ఎంబసీ అధికారులు
కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ పేరిట దేశాధినేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జూలియన్ అసాంజే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వివిధ దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, దేశ రహస్యాలను అసాంజే తన వికీలీక్స్ సంస్థ ద్వారా బట్టబయలు చేశారు. దాంతో అనేక దేశాలు ఆయనపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నాయి. అయితే, కొన్నాళ్ల కిందట అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో స్వీడన్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నించారు. ఆ కేసుకు భయపడి అసాంజే ఏడేళ్లుగా లండన్ లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు.
కానీ, అసాంజే ఓ శరణార్థిలా కాకుండా ఇష్టంవచ్చిన రీతిలో వ్యవహరిస్తూ అంతర్జాతీయ ఒడంబడికలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుండడంతో ఈక్వెడార్ అధికారులు అతడికి ఇచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో, బ్రిటన్ పోలీసులు ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ప్రవేశించి అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. యూకేలో అతడిపై న్యాయవిచారణ జరుగుతుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.