Andhra Pradesh: ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ కు పంపే వరకూ అందరూ జాగ్రత్తగా ఉండాలి: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు ఎలాంటి కుయుక్తులకైనా పాల్పడతారు
- క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
- ప్రజాతీర్పు నిక్షిప్తమైపోయింది. నారాసుర పాలన అంతమైంది
పోలింగ్ ముగిసే చివరి క్షణం వరకూ అప్రమత్తంగా ఉండాలని, క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ కు పంపే వరకూ అందరూ జాగ్రత్తగా ఉండాలని, చంద్రబాబు ఎలాంటి కుయుక్తులకైనా పాల్పడతాడరని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజక వర్గంలో దౌర్జన్యాలకు పాల్పడిందని, అయినా తమ కార్యకర్తలు సంయమనం పాటించారని, నీచపు పనులన్నీ చేసి పత్తిత్తులాగా చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు. జైలుకు వెళ్తానన్న భయంతో చంద్రబాబు ఓ రౌడీలా ప్రవర్తిస్తున్నాడని, పోలింగ్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు రౌడీ మూకలను ఉసిగొల్పారని ఆరోపించారు. అనేక చోట్ల వైసీపీ అభ్యర్థులపై దాడులకు యత్నించారని, వారికి పోలీసుల భద్రత కల్పించకపోయినా ప్రజలు రక్షణ వలయంలా నిల్చుని కాపాడారని ప్రశంసించారు. ‘ప్రజాతీర్పు నిక్షిప్తమైపోయింది. నారాసుర పాలన అంతమైంది. సంబరాలు చేసుకుంటున్నారు’ అని ఓ ట్వీట్ లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.