Odisha: ఒడిశాలో విచిత్రం.. 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటూ పడని వైనం!
- చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా తొలి విడత పోలింగ్ పూర్తి
- మావోయిస్టుల భయంతో ఇళ్ల నుంచి బయటకు రాని ప్రజలు
- మల్కనగిరి జిల్లాలోని చిత్రకొండ, మథిలిలలో ఒక్కరూ ఓటేయని వైనం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కాగా, హైదరాబాద్ వంటి నగరాల్లో అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. అయితే, ఒడిశాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ, మథిలిలలో మావోయిస్టుల భయంతో ఓటు వేసేందుకు ఒక్కరు కూడా ఇల్లు విడిచి బయటకు రాలేదు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సురేంద్ర కుమార్ తెలిపారు.