pakistan: హజరా కమ్యూనిటీ ప్రజలే లక్ష్యంగా పాకిస్థాన్ లో భారీ పేలుడు
- బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో పేలుడు
- 16 మంది దుర్మరణం
- 25 మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా నగరంలో భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ వెజిటబుల్ మార్కెట్లో సంభవించిన ఈ పేలుడులో 16 మంది దుర్మరణం పాలయ్యారు. సుమారు 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
మార్కెట్లోని ఓ షాప్ లో ఐఈడీ ద్వారా ఈ పేలుడుకు పాల్పడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే అక్కడున్న ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని, సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో తనిఖీలను చేపట్టారు. హజరా కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఈ దాడికి తామే పాల్పడ్డామని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు.