Andhra Pradesh: ప్రశాంత్ కిశోర్ పై బిహార్ మాజీ సీఎం ఆరోపణలు!
- ఆర్జేడీని జేడీయూలో విలీనం చేయమన్నారు
- ప్రశాంత్ కిశోర్ పై రబ్రీదేవీ మండిపాటు
- ఆయన్ను వెంటనే వెళ్లిపోవాలని చెప్పినట్లు వ్యాఖ్య
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవీ ప్రశాంత్ కిశోర్ పై ఆరోపణలు చేశారు. ఆర్జేడీని జనతాదళ్(యునైటెడ్)లో విలీనం చేయాల్సిందిగా ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని ఆమె తెలిపారు. తద్వారా లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరం కలిసి ప్రధాని అభ్యర్థిని ప్రకటిద్దామని సూచించారని వ్యాఖ్యానించారు. తనకు బాగా కోపం రావడంతో బయటకు వెళ్లిపోవాల్సిందిగా చెప్పానని రబ్రీదేవీ పేర్కొన్నారు.
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రశాంత్ కిశోర్ ద్వారా ఈ ప్రతిపాదనను పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆర్జేడీ-జేడీయూ విలీనం ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తన వద్దకు తెచ్చారని లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవితచరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయమై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జేడీయూలో చేరక మునుపు తాను చాలాసార్లు లాలూతో భేటీ అయ్యాయని స్పష్టం చేశారు. అప్పుడు తాము ఏం మాట్లాడుకున్నామో బయటపెడితే లాలూ ప్రసాద్ యాదవే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు.