Andhra Pradesh: అప్పుడు ఈవీఎంలను తప్పుబట్టని చంద్రబాబు ఇప్పుడు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదం: ధర్మాన ప్రసాదరావు విమర్శ
- 2014లో లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు?
- టీడీపీ గెలుస్తుందంటూనే ఈవీఎంలు పనిచేయడం లేదంటున్నారు
- విజయవాడలో మీడియాతో వైసీపీ నేత
2014లో ఈవీఎంలను తప్పుబట్టని చంద్రబాబు ఇప్పుడు వాటిపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలిగేలా చంద్రబాబు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మాన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చినవారిని ప్రజలు ఎన్నుకోవచ్చని ధర్మాన అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓవైపు టీడీపీకి 130 సీట్లు వస్తాయని చెబుతూనే, మరోవైపు ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని చంద్రబాబు వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేతలు గౌరవించాలనీ, ఏవైనా సమస్యలు ఉంటే సూచనలు చేయాలని ధర్మాన స్పష్టం చేశారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన బాధ్యత నేతలపై ఉంటుందని వ్యాఖ్యానించారు.