Congress: రాహుల్ ఆలోచనా విధానం మారాలి: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు
- పార్టీలో అగ్రకులాలదే పెత్తనం అని విమర్శ
- ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
- పార్టీలు మారిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల విషయంలో ఆయన తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అగ్రకులాల పెత్తనమే సాగుతోందని విమర్శించారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజమైన కాంగ్రెస్ వాదులను పక్కనపెట్టి పార్టీలు మారుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి అంశాలన్నింటిపై దృష్టిసారించి రాహుల్ తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.