Andhra Pradesh: ఏపీలో మాక్ పోలింగ్ చేసి దాన్ని సాధారణ పోలింగ్ లో కలిపేశారు!: మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణ
- భారీ సంఖ్యలో ఈవీఎంలు పనిచేయకపోవడం ఏంటి?
- ప్రజలు క్యూలైన్లలో చాలా ఇబ్బందులు పడ్డారు
- ఢిల్లీలో మీడియాతో టీడీపీ నేత
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ ఇంత భారీ సంఖ్యలో ఈవీఎంలు పనిచేయకపోవడం ఏంటని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈవీఎంలు పనిచేయక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. కొన్నిచోట్ల మాక్ పోలింగ్ చేసి దాన్ని సాధారణ పోలింగ్ లో కలిపేశారని ఆరోపించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుతో కలిసి ఈరోజు ఢిల్లీకి చేరుకున్న అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నాయకత్వంలో జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ చాలా చోట్ల పోలింగ్ ప్రారంభమే కాలేదనీ, అలాంటి చోట్ల పోలింగ్ సమయాన్ని పెంచాలి కదా? అని అడిగారు. క్యూలైన్ లో ఉన్న ఓటర్లు తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.