Andhra Pradesh: చంద్రబాబు మెంటల్ కేసులాగా ప్రవర్తిస్తున్నారు.. ఎన్టీఆర్ నినాదాన్ని ఆయన గబ్బుగబ్బు పట్టించారు!: వైసీపీ నేత సజ్జల
- ఆయన మానసిక స్థితిని సైకియాట్రిస్టులే చెప్పాలి
- ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ ప్రధాన కార్యదర్శి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఇచ్చిన ‘తెలుగువారి ఆత్మగౌరవం’ నినాదాన్ని చంద్రబాబు గబ్బుగబ్బు పట్టించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ఈవీఎంల విషయంలో చంద్రబాబు ఇప్పుడు మెంటల్ కేసులాగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మిత్రులు ఫరూక్ అబ్దుల్లా వంటివారికి 75 ఏళ్లు వచ్చాయనీ, వాళ్లకు ఏం సమస్యలు ఉన్నాయో తనకు తెలియదన్నారు.
వీవీప్యాట్ లో ఓటు ఎవరికి వేశామో కనపడినప్పటికీ, మరో పార్టీకి పడుతుందని చంద్రబాబు చెబుతున్నారనీ, దీనిని బట్టి చంద్రబాబు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు.
చంద్రబాబు మానసిక స్థితి ఏమిటో సైకియాట్రిస్టులు చెప్పాల్సిన అవసరముందని సజ్జల తెలిపారు. ప్రజల దృష్టిలో టీడీపీ నేతలు దిగజారిపోయారని విమర్శించారు. ఏపీలో 80 శాతం పోలింగ్ నమోదయిందనీ, ప్రజలెవరూ ఇప్పటివరకూ కంప్లైంట్ చేయలేదని వ్యాఖ్యానించారు.
‘కంప్యూటర్ల మొత్తానికి నేనే పితామహుడిని.. టెక్నాలజీని నేనే కనిబెట్టా.. ఏపీలో ఎక్కడ వీధిలైటు వెలగలేదో నా టేబుల్ పై ఉన్న కంప్యూటర్ లో తెలుస్తుంది అని చెప్పే చంద్రబాబే ఈ మాట అన్నారంటే ఆయనకు ఏదో అయిందనీ, లేదా ఫలితాలు మరోరకంగా రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సజ్జల పేర్కొన్నారు.