Uber: దంపతులను ఎయిర్ పోర్టులో దింపి వచ్చి.. వాళ్లింటికే కన్నం వేసిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్
- కాలిఫోర్నియాలో ఘటన
- సెక్యూరిటీ కెమెరాకు చిక్కిన వైనం
- అలారం మోగడంతో పారిపోయిన డ్రైవర్
అమెరికాలో ఓ క్యాబ్ డ్రైవర్ తాను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసిన దంపతుల ఇంటికే కన్నం వేశాడు. కాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన. ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి భార్యాభర్తలు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆ క్యాబ్ కు జాకీ గోర్డాన్ విల్సన్ అనే వ్యక్తి డ్రైవర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎంతో నమ్మకంగా ఇంటికి వచ్చి ఆ దంపతులను ఎక్కించుకుని విమానాశ్రయానికి చేర్చాడు. అనంతరం నేరుగా తాను ఎక్కడ వాళ్లను ఎక్కించుకున్నాడో అక్కడికే వచ్చాడు. తనను ఎవరూ గమనించడంలేదు అనుకుని ఆ దంపతుల ఇంట్లో ప్రవేశించాడు.
అయితే, ఆ భార్యాభర్తల ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాలో అతడి కదలికలు రికార్డయ్యాయి. ఆ కాలనీ వాసులు గ్రూప్ సెక్యూరిటీ సిస్టమ్ ఉపయోగిస్తుండడంతో, ఎవరింటి పరిసరాల్లో అయినా అనుమానాస్పద కదలికలు ఉంటే ఆ వీడియో ఫుటేజ్ అందరికీ వెళుతుంది. ఈ క్రమంలో అలారం మోగడంతో ఆ డ్రైవర్ పరారయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతోపాటు, ఆ దంపతులకు కూడా చెప్పారు.
వాళ్లు వచ్చి ఇంట్లో కొన్ని వస్తువులు చోరీకి గురైనట్టు తెలుసుకున్నారు. ఇరుగుపొరుగు వారు చూపించిన వీడియో చూసి ఆశ్చర్యపోయారు. తమను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లిన ఉబెర్ క్యాబ్ డ్రైవరే దొంగ అవతారం ఎత్తాడని గుర్తించారు. పోలీసులు జాకీ గోర్డాన్ విల్సన్ ను అరెస్టు చేశారు.