Sangeetha: పదమూడేళ్ల వయసు నుంచే పనిచేయించావుకదమ్మా!: తల్లిపై ధ్వజమెత్తిన నటి సంగీత
- స్కూలుకు దూరం చేశావు
- ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నావు
- వ్యసనాల బారినపడ్డ నీ కొడుకుల కోసం నన్ను బలిచేశావు
తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించిన సంగీత కుటుంబ విషయాలు ఇప్పుడు బజారున పడ్డాయి. ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, శివపుత్రుడు, సంక్రాంతి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత తమిళ గాయకుడు క్రిష్ ను పెళ్లాడి జీవితంలో స్థిరపడింది.
అయితే, అనూహ్యరీతిలో ఆమె తల్లి భానుమతి పోలీసులను ఆశ్రయించడం తీవ్ర కలకలం రేపింది. తనను సంగీత ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి నుంచి తనను దూరం చేయాలని చూస్తోందని భానుమతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై సంగీత ట్విట్టర్ లో ఘాటుగా బదులిచ్చారు. ఈ మేరకు తల్లిని ఉద్దేశించి లేఖ రాశారు. ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా అంటూ మొదలుపెట్టి తనను స్కూలుకు దూరం చేసి డబ్బు సంపాదించే వస్తువుగా మార్చిందంటూ తల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
"13 ఏళ్లకు చదువుకు దూరం చేశావు. జీవితంలో ఏనాడూ పనికి వెళ్లకుండా, వ్యసనాల బారినపడిన నీ కొడుకులను ఉద్ధరించడం కోసం నాతో బ్లాంక్ చెక్ లపై సంతకాలు చేయించుకున్నావు, నన్ను నిలువునా దోపిడీ చేశావు కదమ్మా! సంపాదించేది నేను అయినా నా ఇంట్లోనే నన్నో మూలన పడివుండేలా చేశావు. నా జీవితం గురించి నేను పోరాడే వరకు పెళ్లి కూడా చేయకుండా ఉంచావు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా నన్నూ, నా భర్తను వేధిస్తున్నావు. ఓ తల్లి ఎలా ఉండకూడదో నేర్పినందుకు ధన్యవాదాలమ్మా! నీ ఆరోపణలతో నేను మరింత రాటుదేలిపోయానమ్మా, అందుకు కూడా కృతజ్ఞతలు!" అంటూ సంగీత ట్వీట్ చేశారు.