Cricket: ధోనీ భారతజట్టు కోసం అంత ఆవేశం ప్రదర్శించి ఉంటే చాలా సంతోషించేవాడ్ని: సెహ్వాగ్
- ఓ ఐపీఎల్ జట్టు కోసం కోప్పడ్డాడు
- మైదానంలోకి రావాల్సిన అవసరంలేదు
- కనీసం రెండుమూడు మ్యాచ్ లైనా నిషేధించాలి
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పిచ్ వద్దకు దూసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంపైర్ నోబాల్ ఇచ్చి, ఆపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనించిన ధోనీ బౌండరీ లైన్ ఆవల నుంచి ఎంతో ఆవేశంతో పిచ్ వద్దకు వచ్చి అంపైర్లతో వాగ్వివాదం పెట్టుకోవడం తెలిసిందే. కెప్టెన్ కూల్ గా పేరుగాంచిన ధోనీ ఇలా చిన్న విషయానికి క్రీడాస్ఫూర్తిని మర్చిపోయి వ్యవహరించాడంటూ మాజీ క్రికెటర్లు సైతం మండిపడుతున్నారు తాజాగా, ధోనీ ఒకప్పటి సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ దీనిపై విమర్శనాత్మక శైలిలో వ్యాఖ్యానించారు.
ధోనీ టీమిండియా కోసం ఏనాడూ ఇంత ఆవేశం చూపించలేదని, భారత జట్టు కోసం కోప్పడి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడ్నని తెలిపారు. చివరికి ఓ ఐపీఎల్ జట్టు కోసం కోపం ప్రదర్శించాడని పేర్కొన్నారు. పిచ్ మీద ఇద్దరు బ్యాట్స్ మన్లు ఉన్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వాళ్లు చూసుకోగలరని, డగౌట్ లో కూర్చుని ఉన్న ధోనీ మైదానంలోకి వచ్చిమరీ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించాల్సిన అవసరంలేదని వీరూ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను జరిమానాలతో సరిపెట్టకుండా కనీసం రెండుమూడు మ్యాచ్ లైనా నిషేధం విధించాలని సూచించారు.