Ontimitta: హనుమంతుడు కనిపించని ఒంటిమిట్ట కోదండ రామాలయం... కారణమిదే!
- రాముడు, హనుమంతుడు కలవకముందే విగ్రహ ప్రతిష్ఠ
- చంద్రుడికి ఇచ్చిన వరం మేరకు రాత్రి పూట కల్యాణం
- 18న స్వామివారి కల్యాణానికి ఏర్పాట్లు
ఇండియాలో ఉన్న లక్షలాది రామాలయాల్లో అరుదైనదిగా భావించే ఒంటిమిట్ట కోదండ రామాలయం శ్రీరామ బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 18న ఇక్కడ స్వామివారి కల్యాణం జరగనుంది. కడప జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకుని ఉండే ఈ దేవాలయం చరిత్రను పరిశీలిస్తే, ఎన్నో ఆసక్తికర విశేషాలు అబ్బురపరుస్తాయి. దేశంలో హనుమంతుడి విగ్రహం కనిపించని ఏకైక రామాలయం ఇదొక్కటే. దీనికి కారణం ఏంటో తెలుసా? రాముడు, ఆంజనేయుడు కలవడానికి ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల విగ్రహం ప్రతిష్ఠించారట.
రామ లక్ష్మణులను తన యాగ రక్షణకు తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆపై వారిని మిథిలకు తీసుకెళ్లి, శివధనుస్సును విరిచేలా చూసి, సీతారామ కల్యాణం జరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆపై మృకండు మహర్షి తన యాగాన్ని కూడా కాపాడాలని, దుష్టులైన రాక్షసులను శిక్షించాలని రాముడిని ప్రార్థించడంతో, వివాహమైన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై, అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఒంటిమిట్ట ప్రాంతానికి రామచంద్రుడు వచ్చి యాగ రక్షణ చేయగా, ఆపై వారి విగ్రహాలనే ఏకశిలగా చెక్కించారని, తదనంతర కాలంలో జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు.
ఇక ఇక్కడ పున్నమి వెలుగుల్లో స్వామి వారి కల్యాణం ఎందుకు చేస్తారన్నదానికీ ఓ విశేషముంది. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన అర్ధాంగిగా చేసుకోగా, పగలు జరిగే వీరి కల్యాణ మహోత్సవాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవికి సోదరుడిగా అదే పాల సముద్రంలో జన్మించిన చంద్రుడు విన్నవించుకున్నాడట. దీంతో ఒక్క ఒంటిమిట్టలో మాత్రం వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని నారాయణుడు వరమిచ్చాడట. అందుకే ఇక్కడ రాత్రిపూట మాత్రమే స్వామివారి కల్యాణం జరుగుతుంది.