Krishna District: స్ట్రాంగ్ రూమ్ ను తెరిచిన కృష్ణా జిల్లా అధికారులు... కలకలం!
- ఈవీఎంలను బయటకు తీసుకెళ్లిన అధికారులు
- అవి రిజర్వ్ ఈవీఎంలని స్పష్టం చేసిన కలెక్టర్
- రాజకీయ పార్టీలకు చెప్పినా రాలేదన్న ఇంతియాజ్
ఒకసారి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేసిన తరువాత వాటిని ఏ కారణంతోనైనా తెరవాలని భావిస్తే, జిల్లా కలెక్టర్, ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే వాటిని తెరవాల్సివుంటుంది. కానీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ను రాత్రి 10 గంటల సమయంలో అధికారులు తెరిచి, కొన్ని ఈవీఎంలను వాహనాల్లో తీసుకెళ్లకడం కలకలం రేపింది. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచారు. గత వారంలో పోలింగ్ తరువాత, కలెక్టర్, రాజకీయ పార్టీల ఏజంట్ల సమక్షంలో సీల్ వేశారు. సీల్ తీసి, ఈవీఎంలు తీసుకెళ్లారన్న వార్త బయటకు తెలియడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
దీనిపై విమర్శలు చెలరేగుతున్న వేళ, కలెక్టర్ ఇంతియాజ్ స్పందిస్తూ, బయటకు తీసుకెళ్లింది నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రిజర్వు ఈవీఎంలని స్పష్టత ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో వాడేందుకు వాటిని తీసుకెళ్లామని, ఇందులో వివాదం లేదని, అన్ని పార్టీల ప్రతినిధులకూ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను తెరుస్తున్నామని సమాచారం ఇచ్చినా వారు రాలేదని తెలిపారు.