Tirumala: తిరుమల వెంకన్న దర్శనం కలగాలంటే 22 గంటలు ఆగాల్సిందే!
- భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు
- నేడు శ్రీరామనవమి ఆస్థానం
- వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు
భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండి, నారాయణగిరి ఉద్యానవనం వరకూ క్యూలైన్ విస్తరించింది. స్వామి దర్శనానికి 22 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారని, వారికి అన్నపానీయాల ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.
నేడు స్వామివారికి శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నామని, రాత్రి 7 గంటల సమయంలో హనుమంత వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశామని, మిగతా సేవలు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా, ప్రత్యేక దర్శనం భక్తులకు స్వామి దర్శనానికి 3 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.