B.R.Ambedkar: జీహెచ్ఎంసీ చెత్తబండిలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం..దళిత సంఘాల నిరసన.. ఉద్రిక్తత!
- పంజాగుట్ట సర్కిల్లో విగ్రహ ప్రతిష్ఠాపనకు యత్నం
- అనుమతి లేదంటూ అడ్డుకున్న జీహెచ్ఎంసీ అధికారులు
- చెత్త తరలించే వాహనంలో చెత్తమధ్యన పడేసి డంపింగ్ యార్డ్‌కు తరలింపు
అంబేద్కర్ జయంతికి ముందు రోజే ఆయనకు అవమానం జరిగింది. హైదరాబాద్‌లో చెత్తను తరలించే వాహనంలో చెత్త మధ్యన అంబేద్కర్ విగ్రహం కనిపించడం వివాదాస్పదమైంది. విగ్రహానికి అనుమతి లేదంటూ పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అయితే, అలా తొలగించిన విగ్రహం జీహెచ్ఎంసీ చెత్త వాహనంలో చెత్త మధ్య కనిపించడం వివాదాస్పదమైంది. జీహెచ్ఎంసీ తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నష్టనివారణ చర్యలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
శుక్రవారం రాత్రి పంజాగుట్ట సర్కిల్లో రాజశేఖరరెడ్డి విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కొందరు ప్రయత్నించారు. విషయం తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతి లేదంటూ పోలీసుల సాయంతో విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కొందరు ధర్నాకు దిగారు. దీంతో విగ్రహాన్ని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియానికి తరలిస్తామంటూ పోలీసులు వారికి నచ్చజెప్పారు.
అయితే, ఆ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ చెత్తబండిలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘం సభ్యులు డంపింగ్ యార్డుకు కొద్ది దూరంలో వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని పరిశీలించగా చెత్తమధ్యలో అంబేద్కర్ విగ్రహం కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఉద్రిక్తతలు చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. యూసుఫ్‌గూడ యార్డ్ ఆపరేటర్ బాలాజీపై చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.