Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రీపోలింగ్ జరగనున్న రెండు ప్రాంతాలు ఇవే!

  • గుంటూరు జిల్లాలోని 244వ బూత్ లో నకిలీ ఓటర్లు
  • కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు
  • నరసరావుపేటలో పీవో తప్పిదంతో రీపోలింగ్

అక్కడక్కడా హింసాత్మక ఘటనలు మినహా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 11న ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రమంతటా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినా ప్రజలు ఓపిగ్గా ఓటేయడంతో పోలింగ్ 79 శాతానికి చేరుకుంది. అయితే కొన్నిచోట్ల అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయించింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ వార్డులో పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల సమయం ముగిసినా ఓటర్లు క్యూలైన్ లో ఉండటంలో అధికారులు 300 స్లిప్పులను అందజేశారు. అయితే పోలింగ్ కేంద్రం ప్రాంగణానికి ప్రహరి లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు చాలామంది క్యూలైన్లలోకి చొరబడ్డారు. స్లిప్పులు లేకుండానే ఓటు వేశారు. ఈ విషయమై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ రిపోలింగ్ నిర్వహించాలని నివేదిక ఇచ్చారు.

అలాగే నరసరావుపేటలోని కేసానుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 94వ పోలింగ్ బూత్ లో పోలింగ్ అధికారి తప్పిదం కారణంగా రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మాక్ పోలింగ్ సందర్భంగా 50 ఓట్లను వేయించిన పీవో, 50 వీవీప్యాట్ స్లిప్పులను పక్కనపెట్టారు. అయితే ఈవీఎంల్లో మాత్రం ఈ ఓట్లను తీసివేయలేదు. దీన్ని గుర్తించిన అధికారులు రీపోలింగ్ కు ఆదేశాలిచ్చారు.

  • Loading...

More Telugu News