bihar: బీహార్ జైలులో మహిళా ఖైదీకి లైంగిక వేధింపులు.. స్పందించిన కేంద్రం
- బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఘటన
- బాధితురాలి కుమార్తెకూ వేధింపులు
- పీఎంవో, సీఎంవో, మహిళా కమిషన్ కు బాధితురాలి ఫిర్యాదు
కట్టుదిట్టమైన జైళ్లలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళా ఖైదీపై జైలు అధికారులతో పాటు తోటి ఖైదీలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీన్ని ఓపికగా భరించిన బాధితురాలు.. జైలులో తనను కలుసుకునేందుకు వచ్చిన కుమార్తెపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బీహార్ లోని ముజఫర్ పూర్ లో చోటుచేసుకుంది. ఇక్కడి షహీద్ ఖుదిరామ్ బోస్ సెంట్రల్ జైలులో ఓ మహిళా ఖైదీ శిక్ష అనుభవిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమెను జైలు సూపరింటెండెంట్ రాజీవ్ కుమార్ సింగ్, కొంత మంది మహిళా పోలీసులు, తోటి ఖైదీలు లైంగికంగా వేధించారు. చివరికి వీరు బాధితురాలి కుమార్తెను కూడా విడిచిపెట్టకపోవడంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో), జాతీయ మహిళా కమిషన్, బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి లేఖ రాసింది. దీంతో వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం, ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించాలనీ, వీలైనంత త్వరగా విచారణ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేసింది.