Andhra Pradesh: పోలింగ్ రోజున టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు: అంబటి రాంబాబు
- పోలింగ్ బూత్ లోకెళ్లి కోడెల తలుపులు వేసుకున్నారు
- కోడెల తీరును గ్రామస్తులు నిరసించారు
- దీనిపై విచారణ చేయకుండానే మాపై కేసులు పెట్టారు
ఎన్నికల పోలింగ్ రోజున ఇనిమెట్ల బూత్ లోకి కోడెల శివప్రసాద్ వెళ్లి తలుపులు వేసుకున్నారనీ, ఆయన తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ నెల 11న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఆ పార్టీ నేేతలు ఫిర్యాదు చేశారు.
అనంతరం, మీడియాతో అంబటి మాట్లాడుతూ, ఇనిమెట్ల ఘటనపై విచారణ చేయకుండానే తమపై కేసులు పెట్టారని అన్నారు. పోలింగ్ రోజున గురజాలలో అధికారపార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరించారని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రూరల్ ఎస్సీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ, పోలింగ్ రోజున టీడీపీ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అరాచకాలు సృష్టించిన టీడీపీ నేతలకు శిక్ష తప్పదని అన్నారు.