Hari prasad: హరిప్రసాద్‌పై ఇప్పుడు అభ్యంతరం.. అప్పుడాయన అరెస్ట్‌పై జీవీఎల్ స్పందన ఇదీ!
- ఏపీ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్‌పై జీవీఎల్ మండిపాటు
- అప్పట్లో ఆయన అరెస్ట్ నీచమన్న జీవీఎల్
- హరిప్రసాద్‌పై ఈసీ నిర్లజ్జగా నీచమైన ఆరోపణలు చేస్తోందని మండిపాటు
ఎన్నికల సంఘం, ఈవీఎంలలో లోపాలను ఎత్తిచూపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్‌ను ఎన్నికల సంఘం చర్చలకు అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ఈవీఎంను ఎత్తుకెళ్లిన ఘటనలో ఆయనపై క్రిమినల్ కేసు ఉందని, అప్పట్లో ఆయన అరెస్టయ్యారని ఈసీ పేర్కొంది. గతంలో ఆయనతో పలు దఫాలు చర్చించిన ఈసీ ఈ సరికొత్త వాదనను తెరపైకి తీసుకురావడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
హరిప్రసాద్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. మరోవైపు చంద్రబాబుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి తప్పదనే భయంతోనే చంద్రబాబు ఈ సరికొత్త నాటకానికి తెరలేపారని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో హరిప్రసాద్‌పై జీవీఎల్ స్పందించిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో హరిప్రసాద్ అరెస్ట్‌ను ఖండిస్తూ తన బ్లాగులో జీవీఎల్ స్పందించారు.
‘ఎన్నికల కమిషన్ వికృత కోణం: ఈవీఎం శూలశోధనకు హరిప్రసాద్ అరెస్టు’ పేరుతో పెద్ద వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో ఈసీపై ధ్వజమెత్తిన ఆయన హరిప్రసాద్‌ను సమర్థించారు. ఆయనపై ఈసీ నిర్లజ్జగా నీచమైన ఆరోపణలు చేస్తోందని, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిరూపించేందుకే ఈవీఎంను ఆయన ఉపయోగించారని పేర్కొన్నారు. ఈసీ హాస్యాస్పద, అశాస్త్రీయ నిబంధనలు పెడుతోందంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.