Karnataka: నరేంద్ర మోదీ హెలికాప్టర్ లో భారీ ట్రంకుపెట్టె... అందులో ఏముందో చెప్పాలన్న కాంగ్రెస్ నేత!
- కర్ణాటక ఎన్నికల ప్రచార వేళ ఘటన
- కాన్వాయ్ లో లేని కారులో పెట్టె తరలింపు
- డబ్బు తెచ్చారని ఆరోపించిన ఆనంద్ శర్మ
ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన వేళ, ఓ హెలికాప్టర్ లో భారీ ట్రంకుపెట్టెను తీసుకురావడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఇద్దరు వ్యక్తులు, ఈ ట్రంకుపెట్టెను తీసుకెళ్లి ఓ కారులో పెట్టగా, అది వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కారు ఎక్కడికి వెళ్లిందన్న విషయం తెలియరాకపోగా, ఈ దృశ్యాలను ప్రధాని పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా చిత్రీకరించగా, ఈ పెట్టెలో భారీ ఎత్తున డబ్బులు తెచ్చారని, ఎన్నికలను ప్రభావితం చేసేందుకే తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ ఘటనపై ప్రధాని వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. మోదీ చాపర్ కు రక్షణగా మరో 3 చాపర్లు ఇక్కడికి వచ్చాయని, అవి ల్యాండయిన తరువాత, ఓ చాపర్ నుంచి ఈ పెట్టెను దించి తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. ఈ ఇన్నోవా కారు ప్రధాని కాన్వాయ్ కి సంబంధించినది కాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న మోదీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.