Hyderabad: కేసీఆర్ ఆ మూడింటికీ అంగీకరిస్తే నేను టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రెడీ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- ముఖ్యమంత్రికి ఇదే నా ఆఫర్
- జైశ్రీరాం అన్నా మతం ముసుగుతొడుగుతున్న రోజులివి
- అఖండ హిందూరాజ్య స్థాపనకు ప్రతిఒక్కరు పాటుపడాలి
హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఏకైక ప్రతినిధి రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. మూడు అంశాల్లో బీజేపీ పోరాటానికి ఆయన కలిసి వస్తే తాను టీఆర్‌ఎస్‌లో చేరిపోయేందుకు సిద్ధమన్నారు. హైదరాబాద్‌లో నిన్న శ్రీరామ్ శోభాయాత్ర సందర్భంగా సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల దగ్గర జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం, గోవుల సంరక్షణ, మతమార్పిడులకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, తమ పోరాటానికి కేసీఆర్ కలిసి రావాలని కోరారు. నేడు దేశంలో జైశ్రీరాం అనడం కూడా మతపరమైన అంశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్యమందిర నిర్మాణం, అఖండ హిందూరాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు కంకణబద్ధుడు కావాలని పిలుపునిచ్చారు.
అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తయ్యాక మధుర, కాశీల్లోనూ మందిరాలు నిర్మించనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అనడానికి కూడా సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. తమకు పది నుంచి ఇరవై నిమిషాల సమయం ఇస్తే భారత్‌లో తిష్టవేసుకుని కూర్చున్న దేశద్రోహులను తరిమి కొడతామని తెలిపారు.