Azamkhan: జయప్రదపై వ్యాఖ్యలను నిరూపిస్తే పోటీకి దూరం: ఆజంఖాన్ సవాల్
- దుమారం రేపిన ఆజంఖాన్ వ్యాఖ్యలు
- ఎవరినీ అవమానించలేదని స్పష్టీకరణ
- తనకు ఎలా మాట్లాడాలో తెలుసునన్న ఆజంఖాన్
బీజేపీ తరఫున పోటీ పడుతున్న జయప్రద ఖాకీ అండర్ వేర్ ధరిస్తోందంటూ సమాజ్ వాదీ అభ్యర్థి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్న వేళ ఆయన స్పందించారు. తాను ఆమె అండర్ వేర్ ఖాకీ కలర్ లో ఉందని అనలేదని, అలా అన్నానని నిరూపిస్తే, ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని సవాల్ విసిరారు.
"నేను ఎవరి పేరునూ చెప్పలేదు. ఎవరినీ అవమానించలేదు. నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. నాది తప్పని నిరూపిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయబోను. నేను రామ్ పూర్ నుంచి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మంత్రిగా కూడా పనిచేశాను. ఎలా మాట్లాడాలో నాకు తెలుసు" అని ఆయన అన్నారు. తాను 150 రైఫిల్స్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి గురించి, అతని ఆర్ఎస్ఎస్ నేపథ్యం గురించి మాట్లాడానని, అతని పేరును కూడా చెప్పలేదని, అన్నారు.
కాగా, జయప్రదను తానే రామ్ పూర్ కు తీసుకువచ్చానని, ఈ నగర వీధులను ఆమెకు అలవాటు చేశానని, ఆమెను ఎవరూ తాకకుండా చూశానని ఆజం ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాల వేగం పెరుగుతోంది.