Prakash Raj: ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు!
- ఎన్నికలు అభివృద్ధికి, ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదు
- ఆరోపణలు, అభియోగాలు, విభేదాల ప్రాతిపదికన జరిగాయి
- నాడున్న చంద్రబాబు విజన్ నేడు కనిపించలేదన్న ప్రకాశ్ రాజ్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అభివృద్ధికి, ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య జరగలేదని, వ్యక్తిగత నిందారోపణలు, పరస్పర అభియోగాలు, నేతల మధ్య విభేదాలు ప్రాతిపదికన జరిగాయని తాను భావిస్తున్నట్టు నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా, "ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు?" అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
తనకు ఏపీ ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న విషయమై క్షేత్రస్థాయిలో అవగాహన లేదని, అయితే, అత్యధికులు చంద్రబాబుకు గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని అంటున్నారని, ఇదే సమయంలో జగన్ చాలా ఎదిగారని చెబుతున్నారని అన్నారు. ఓ విజన్ ఉన్న నాయకుడైన చంద్రబాబు, తన విజన్ ను ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకు రాలేదని భావిస్తున్నట్టు చెప్పారు.
సమైక్యాంధ్ర విడిపోయిన వేళ, చంద్రబాబు ఓ అనుభవం ఉన్న నేతగా ప్రతి ఒక్కరికీ కనిపించారని, నేడు ఆయన కేవలం ఆరోపణలకు పరిమితం అయ్యారని, జగన్ కూడా అంతేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ పండగ వంటివని, అటువంటి పండగ వేళ, హత్యలు, గొడవలు ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలను పగులగొట్టిన దృశ్యాలను చూసి బాధపడ్డానని అన్నారు. ప్రజలు పోటీలో ఉన్న అభ్యర్థుల చరిత్ర, స్థానిక సమస్యలను, అవి పరిష్కరించే సత్తా ఉన్న వారికే ఓటు వేసివుంటారని భావిస్తున్నానని అన్నారు.