Tamilnadu: ఓ ముద్దు ఇవ్వు.. లేదంటే సెల్ఫీని మీ అమ్మానాన్నలకు చూపిస్తా!: యువతిని బ్లాక్ మెయిల్ చేసిన స్నేహితుడు
- ప్రేమ పేరుతో వేధించిన నిందితుడు
- ముద్దు ఇస్తుండగా స్నేహితుడి సాయంతో చిత్రీకరణ
- యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్
అమ్మాయిలు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలో చెప్పే ఘటన ఇది. ప్రేమిస్తున్నానని ఓ యువకుడు యువతి వెంట పడ్డాడు. ఆమె నిరాకరించడంతో స్నేహంగా నటిస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. చివరికి దాన్ని సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.
తనకు ముద్దు పెడితే సెల్ఫీ డిలీట్ చేస్తానన్నాడు. ఇందుకు తలొగ్గిన యువతి ముద్దు పెట్టగా దాన్ని మరొకరితో ఫొటో తీయించి వేధింపులు తీవ్రతరం చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
చెన్నైలోని మడిపాక్కం పాలయాగార్డెన్స్‌కు చెందిన ఓ యువతి(18) ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న శ్రీనాథ్ అనే కుర్రాడు ప్రేమిస్తున్నానని వెంటపడటం మొదలుపెట్టాడు. అయితే యువతి అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించింది.
ఈ క్రమంలో మహాబలిపురానికి వెళ్లిన సమయంలో యువకుడు యువతితో కలిసి సెల్ఫీ దిగాడు. తనకు ముద్దు ఇవ్వాలనీ, లేదంటే ఈ సెల్ఫీని కుటుంబ సభ్యులకు చూపుతానని, సోషల్ మీడియాలో పెడతానని యువతిని బెదిరించాడు.
దీంతో భయపడ్డ యువతి ముద్దు ఇచ్చేందకు సిద్ధపడింది. ఆమె యువకుడికి ముద్దు ఇస్తుండగా నిందితుడి స్నేహితుడు ఈ తతంగాన్ని ఫొటో తీశాడు. చివరికి అతని వేధింపులు హద్దు దాటడంతో తల్లిదండ్రులకు బాధితురాలు అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీనాథ్ తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు వీరిద్దరిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు.