Andhra Pradesh: తెలుగుదేశం పోరాటం వల్లే వీవీప్యాట్ యంత్రాలను ప్రవేశపెట్టారు!: మంత్రి యనమల
- ఎవరికి ఓటేశామో తెలుసుకునే హక్కు ప్రజలకుంది
- కేవలం 2 శాతం వీవీప్యాట్ లనే లెక్కిస్తామని ఈసీ చెబుతోంది
- దేశంలో 22 పార్టీలు కోరుతుంటే అభ్యంతరం ఏంటి?
ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని టీడీపీ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రజలకు అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు.
50 శాతం వీవీప్యాట్ యంత్రాలను లెక్కించడానికి వారం రోజులు పడుతుందని ఈసీ చెప్పడం సరికాదన్నారు. టీడీపీ పోరాటం చేయడంతోనే ఈసీ వీవీప్యాట్ యంత్రాలను తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు యనమల మీడియాతో మాట్లాడారు.
ఈవీఎంల పనితీరుపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయనీ, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ విషయమై పోరాటాలు చేశామని పేర్కొన్నారు. కేవలం 2 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కిస్తామని ఈసీ చెప్పడం సరికాదన్నారు.
దేశంలో బీజేపీ మినహా మిగిలిన 22 పార్టీలన్నీ 50 శాతం వీవీప్యాట్ యంత్రాలను లెక్కించాలని కోరుతున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈవీఎంలను ప్రవేశపెట్టి వెనక్కి తీసుకున్నాయని గుర్తుచేశారు.