vvpat: వీవీ ప్యాట్ లను ఈ విధంగా హ్యాక్ చేయవచ్చు: వేమూరు హరికృష్ణ ప్రసాద్
- వీవీ ప్యాట్ ర్యాండమైజేషన్ లో లొసుగులు ఉన్నాయి
- వీవీ ప్యాట్ లను నియంత్రణలోకి తీసుకుంటే హ్యాక్ చేయవచ్చు
- ఎవరికి ఓటు వేసినా.. మనకు నచ్చిన వారికి ఓటు వెళ్లేలా నియంత్రించవచ్చు
వీవీ ప్యాట్ యంత్రాలను హ్యాక్ చేయడం చాలా ఈజీ అని ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు వేమూరు హరికృష్ణ ప్రసాద్ చెప్పారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం...
ఈవీఎంలకు సంబంధించి ర్యాండమైజేషన్ అనే విధానాన్ని ఎన్నికల అధికారులు అనుసరిస్తారు. గోదాముల నుంచి ఈవీఎంలను బయటకు తీశాక... తొలి అంచెలో ఏ నియోజకవర్గానికి ఏ లాట్ వెళ్లాలో నిర్ణయిస్తారు. ఈవీఎంలు సదరు నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత... రెండో అంచె ర్యాండమైజేషన్ లో ఏ బూత్ కు ఏ ఈవీఎంలు వెళ్లాలో నిర్ణయిస్తారు.
గోదాము నుంచి ఏ ఈవీఎం ఏ బూత్ కు వెళుతుందో తెలియదు కాబట్టి... వాటిని హ్యాక్ చేయడం కుదరదని ఈసీ చెబుతోంది. కానీ వీవీ ప్యాట్ ల ర్యాండమైజేషన్ తప్పుల తడకగా ఉంది. ఏ నియోజకవర్గమైనా, ఏ బూత్ అయినా ప్రధాన పార్టీల గుర్తులు ఒకటే ఉంటాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎం3 మోడల్ లో బ్యాలట్ యూనిట్ వీవీ ప్యాట్ కు, వీవీ ప్యాట్ కంట్రోల్ యూనిట్ కు అనుసంధానమై ఉంటుంది.
బ్యాలెట్ యూనిట్ ఓటరు బటన్ నొక్కిన వెంటనే... సిగ్నల్ మొదట వీవీ ప్యాట్ కు వెళుతుంది. ఈ ఓటు ఫలానా గుర్తుకు వెళ్లిందని కంట్రోల్ యూనిట్ లో ఉన్న మెమొరీకి చెబుతుంది. ఈ సాంకేతిక అంశమే వీవీ ప్యాట్లను హ్యాక్ చేసేందుకు సహకరిస్తుంది. వీవీ ప్యాట్లను మనం నియంత్రణలోకి తీసుకుంటే... దాన్ని చాలా ఈజీగా హ్యాక్ చేయవచ్చు. ఓటరు ఎవరికి ఓటు వేసినా... మనం అనుకున్న వారికి ఓటు వెళ్లేలా చేయవచ్చు.