Kerala: కాంగ్రెస్ నేత శశిథరూర్ తలకు తీవ్రగాయం.. తులాభారం వేస్తుండగా ఘటన!
- 6 కుట్లు వేసిన తిరువనంతపురం వైద్యులు
- ఆలయంలో మొక్కు చెల్లిస్తుండగా ఘటన
- మలయాళ నూతన సంవత్సరాది సందర్భంగా పూజలు
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కేరళలోని పలు ఆలయాలను శశిథరూర్ ఇటీవలి కాలంలో సందర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో మలయాళ నూతన సంవత్సరాది విషు సందర్భంగా తిరువనంతపురంలోని ఓ ఆలయాన్ని శశిథరూర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండ్లు, స్వీట్లతో తులాభారం నిర్వహించారు.
అయితే పెద్ద త్రాసులో కూర్చున్న శశిథరూర్ అనూహ్యంగా అదుపుతప్పి పక్కకు పడిపోయారు. దీంతో గోడ తగిలి ఆయన తలకు బలమైన గాయం అయింది. వెంటనే పక్కనున్న అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను హుటాహుటిన తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన వైద్యులు.. శశిథరూర్ తలకు 6 కుట్లు వేశారు.
ఇప్పటికే తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందిన శశిథరూర్.. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఎల్డీఎఫ్(కమ్యూనిస్టులు) అభ్యర్థి సి.దివాకరణ్, బీజేపీ అభ్యర్థి కుమ్మనమ్ రాజశేఖరన్ థరూర్ కు పోటీగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 23న కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.