Andhra Pradesh: అందుకే 2014 ఎన్నికల్లో గెలవగానే ఏడ్చేశాను!: వైసీపీ నేత రోజా
- నేను గెలిచినందుకు టీడీపీలో 70 శాతం మంది బాధపడ్డారు
- ఈసారి గెలవడం వాళ్లకు అస్సలు ఇష్టం లేదు
- మీడియా ఛానల్ తో మాట్లాడిన వైసీపీ నేత
2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలవగానే టీడీపీలో 70 శాతం మంది నేతలు ఏడ్చారని వైసీపీ నేత ఆర్కే రోజా తెలిపారు. 'అబ్బా వచ్చేసిందిరా ఇది.. ఎంత చేసినా ఆపలేకపోయాం' అని బాధపడ్డారని వ్యాఖ్యానించారు. అలాంటిది ఇప్పుడు మరోసారి ఎన్నికకావడం అన్నది వాళ్లకు అస్సలు ఇష్టం లేదన్నారు.
మిగతావారికి 2014 అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఎన్నికలే కాగా, తనకు మాత్రం అది యుద్ధమని అన్నారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో ఓడిపోయుంటే తన రాజకీయ జీవితం ముగిసిపోయేదని అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు.
నగరి స్థానం నుంచి ఒకవేళ ఓడిపోయి ఉంటే తాను తలెత్తుకోలేకుండా టీడీపీ నేతలు చేసేవారని విమర్శించారు. చెరో 30 ఏళ్ల అనుభవం ఉన్న చెంగా రెడ్డి, ముద్దు కృష్ణమనాయుడు ఇద్దరూ తనను ఓడిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారనీ, వారిని తట్టుకుని గెలిచానంటే అది మామూలు విషయం కాదని రోజా పేర్కొన్నారు. అందుకే ఆరోజు ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎమోషనల్ అయిపోయాననీ, కన్నీరు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు. అవి ఆనంద బాష్పాలేనని స్పష్టం చేశారు.