Andhra Pradesh: నా నోరు మంచిది కాదు.. నన్ను గోకారంటే ఎంతగానైనా తిడతా!: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
- వైఎస్ ఉన్నప్పుడు అసెంబ్లీకి నిండుతనం ఉండేది
- మంచిగా ఉంటే సబ్జెక్ట్ పై ఎంత సేపయినా మాట్లాడుతా
- మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ నేత
ఒకానొక సందర్భంలో తాను ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నికయ్యానా? అని తనకు అనిపించిందని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మజ్లిస్, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల నేతలతో అసెంబ్లీకి నిండుతనం ఉండేదనీ, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక ఉన్న ఆసక్తి కాస్తా పోయిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాలంలో సభాసంప్రదాయాలు పూర్తిగా మంటకలిసి పోయాయని అన్నారు. ఓ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు.
అప్పట్లో అసెంబ్లీలో సభ్యులు హుందాగా మాట్లాడేవారనీ, వారి నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించేదని రోజా తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అరుస్తూ, గోలచేస్తూ వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా సభ్యులు సహనం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీలో వైసీపీ ఏకైక ప్రతిపక్షంగా మారిపోవడంతో ‘ఏమిటి వీళ్లకు గౌరవం ఇచ్చేది? సభలో మాకే బలం ఉంది. బిల్లులను మేం పాస్ చేసుకుంటాం’ అనే నిర్లక్ష్యం ప్రభుత్వానికి వచ్చేసిందని అభిప్రాయపడ్డారు.
‘మంచిగా మాట్లాడితే ఎంతసేపయినా నేను సబ్జెక్ట్ పైన మాట్లాడుతా. కానీ నన్ను గోకారంటే మాత్రం ఎంతగానైనా తిడతా. అది ఆరోజు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చూపించాను. అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం నా నోరు మంచిది కాదు. అప్పుడు ఎంతదూరమైనా వదిలిపెట్టను. డీసెన్సీని పక్కన పెట్టేస్తా’ అని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించినప్పుడు జవాబు చెప్పకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే తన ప్రతిస్పందన కూడా తీవ్రంగా ఉంటుందని రోజా తేల్చిచెప్పారు.