Andhra Pradesh: హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఆర్టీసీ బస్సులో లేడు.. 5 స్టార్ బస్సులో గడిపాడు!: వైసీపీ నేత రోజా
- టీడీపీ నేతలు చంద్రబాబును పొగడటమే పనిగా పెట్టుకున్నారు
- కనీసం ఒడిశాలా జాగ్రత్త చర్యలు తీసుకోలేదు
- ఇదేనా టెక్నాలజీ అంటే?
- టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరి ఎమ్మెల్యే
2014లో కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును పొగడటమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. వారి చేతుల్లో ఇప్పుడు చిడతలు ఒక్కటే తక్కువ అయ్యాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యే అనితను ప్రస్తావించిన రోజా..‘హుద్ హుద్ తుపానుతో నా కారే తిరగబడిపోయేది కానీ చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల నేను బతికాను అని చెప్పింది.
అంటే చంద్రబాబు ఏమన్నా కారును తిప్పి పెడతాడా? చంద్రబాబు కాబట్టి బస్సులో ఉన్నాడు అని అనిత చెబుతున్నారు. చంద్రబాబు ఏమన్నా ఆర్టీసీ బస్సులో ఉన్నాడా? ఆ బస్సులో 5 స్టార్ హోటల్ లో ఉండే సౌకర్యాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడారు.
ఒకవేళ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉంటే సానుభూతి కోసం ఇలా ప్రయత్నించేవారు కాదని రోజా స్పష్టం చేశారు. ఈరోజు జగన్ పడ్డ కష్టం ఆయన వయసులో ఏ రాజకీయ నాయకుడూ పడి ఉండడని వ్యాఖ్యానించారు. లగ్జరీలో పుట్టిన జగన్ సింపుల్ గా ఉంటారన్నారు. ‘టెక్నాలజీతో తుపానును ఆపేశాను అని చంద్రబాబు అంటారు. ఒడిశాలో ముగ్గురు, నలుగురు చనిపోతే, ఇక్కడ 60 మంది చనిపోయారు.
ఒడిశాలో చెట్లన్నీ నరికేశారు. వారానికి సరిపడా నిత్యావసరాలు అందించారు. విద్యుత్ తీగల ఎత్తును తగ్గించారు’ అని గుర్తుచేశారు. ఏపీలోని విశాఖను హుద్ హుద్ తాకుతుందని తెలిసినప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తమ మాటలతో చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల నిర్వాకం కారణంగానే కేంద్రం అందించే నిధులు రూ.400 కోట్లకు పడిపోయాయని దుయ్యబట్టారు.